Writer Lakshmi Bhupala great words about Megastar Chiranjeevi:

Lakshmi Bhupala is a Telugu writer who worked for many successful films like Chandamama, Ala Modalaindi, Nene Raju Nene Mantri.

Lakshmi Bhupala usually expresses his idealogies, views on contemporary issues, film personalities through his facebook profile. On the eve of Megastar Chiranjeevi birthday Lakshmi Bhupala wrote some great words about Chiranjeevi.

Lakshmi Bhupala Facebook post:

చిరంజీవి చిరంజీవ!
సుఖీభవ సుఖీభవ!!

నల్లగానో, ఛామనఛాయ గానో ఉండే ఒకబ్బాయి..పిల్లికళ్ళలాంటి తేనేకళ్ళు.. కాళ్లు కూడా చిన్న తేడా ఉంటాయి.. ఇండస్ట్రీలో సపోర్ట్ లేదు, వెనకాముందు ఎవరూ లేరు.. సొంతంగా హీరో అయిపోడానికి సరిపడా డబ్బుల్లేవు.. ఉన్నది ఒక్కటే… తనపైన తనకు నమ్మకం..
ఆ నమ్మకం అంచెలంచెలుగా ఎదిగి సినీవినీలాకాశంలో ‘మెగాస్టార్’ గా ప్రకాశించింది..

గొప్పవాళ్ల పేరు సంస్థలకో, వీధులకో, అవార్డులకో పెట్టినట్టే, ఒక నటుడు హీరోగా మారి, స్టార్ గా ఎదగడానికి మధ్యలో ఉండే ‘కాలానికి’ “చిరంజీవి” అనే పేరు పెట్టాలి..

ఈరోజు ఆయన మెగాస్టార్ కావచ్చు.. 150 సినిమాల పైనే నటించొచ్చు.. హిట్లు, బ్లాక్ బస్టర్లు ఉండొచ్చు..కోట్లల్లో అభిమానులు ఉండొచ్చు.. కానీ ‘చిరంజీవి’ అనే పేరు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, కేవలం ఇలాంటి వాటి వల్ల మాత్రమే కాదని అనిపిస్తుంది..

నిరంతర కృషి, పట్టుదల, మొక్కవోని దీక్ష, అహర్నిశలు మంచి మంచి పాత్రల కోసం ఆరాటం, మిగిలిన వాళ్ళ కంటే విభిన్నంగా ఉండాలనే ప్రయత్నం, ఎదిగినా ఒదిగి ఉండే నమ్రత, ఇష్టపడే వాళ్ళ కోసం కష్టపడితే గుండెల్లో పెట్టుకుంటారని నమ్మి ఇంటిని, ఇల్లాలుని, పిల్లల్ని వదిలి రేయింబవళ్లు పడ్డ శ్రమ……. ఇలా ఎన్నో పాఠాలు మనకు ఆచరించి చూపించిన మార్గదర్శి “చిరంజీవి”..

చెన్నైలో అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరి నటనపై ఒక అవగాహన తెచ్చుకుని, ఒక్కొక్క ఆఫీసు కి వందలసార్లు తిరిగి, డైలాగ్ లు చెప్పి, ఆడిషన్ ఇచ్చి, షూటింగుల్లోకి ఒక టేప్ రికార్డర్ పట్టుకెళ్లి ‘నేను డాన్స్ చేస్తాను, ఒక్కసారి చూడండి సర్” అని ఏమాత్రం సిగ్గుపడకుండా తన ప్రతిభను అందరిముందూ ప్రదర్శిస్తూ, అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు, ‘జయమాలిని డాన్సులు చేసేవాడు కూడా హీరో అయిపోదామని వచ్చేశాడు’ అంటే అలాంటి అవమానాల్ని నవ్వుతూ భరించి, ‘సంకల్పం ముందు అవమానం ఇసుకరేణువంత’ అని అనుకున్న రంగంలో శిఖరాన్ని చేరుకుని, నోళ్లు మూయించి తన ‘జెండా’ శాశ్వతంగా పాతేసిన ఘట్టం ఒక్కసారి గుర్తు చేసుకుంటే………… ఊపిరి ఉద్వేగంతో కొట్టుకుంటూ ఇది కదా సాధించడం అంటే అనిపిస్తుంది..

అత్యున్నత అవార్డులు, కోట్లాది ప్రేక్షకుల చప్పట్లు, ఈలలు, రక్తం, ప్రాణం ఇచ్చేంత పిచ్చి అభిమానులు ఉన్నా కూడా…..ఆయన లోని నటుడికి ఇప్పటికీ నటదాహం తీరలేదు.. నాకు తెలిసి అది ఎప్పటికీ తీరదు.. ఎన్నో పాత్రల్లో నటించి, రకరకాల మేనరిజమ్స్ తో డైలాగ్స్ చెప్పి, అద్భుతమైన డాన్సులు చేసి ‘చిరంజీవి’ అనే స్టార్ అందరినీ మెప్పిస్తే, ప్రేక్షకులు, ఆయన అభిమానులు మాత్రం ఆయనకి కొంత అన్యాయం చేశారనే చెప్పాలి..
ఎలాగంటే… తనలో ఉన్న నటుడ్ని కొత్తగా ఆవిష్కరించుకోవడం కోసం, వచ్చిన స్టార్ ఇమేజ్ ని పక్కనపెట్టి, ఆపద్భాంధవుడు, రుద్రవీణ లాంటి సినిమాలు చేస్తే మొహమాటం లేకుండా తిప్పికొట్టాం.. ఒక రకంగా చిరంజీవి లోని ఒరిజినల్ నటుడ్ని అవమానించినట్టే అని నా వ్యక్తిగత అభిప్రాయం.. ‘పోనీ అవి పిచ్చి సినిమాలా ?’ అంటే కాదంటారు..”ఆ సినిమాలు బాగుంటాయండీ, కానీ ఎందుకో ఆడలేదు” అని ఇప్పుడంటారు.. ఈ విషయంలో ప్రేక్షకులు, అభిమానులు ఎప్పుడూ స్వార్ధపరులే.. వాళ్ళకి కావాల్సిందే ఇవ్వాలి.. అది చిరంజీవయినా సరే అని నిరూపించారు..అయినా ‘చిరంజీవి’ దాన్ని కూడా నవ్వుతూ అంగీకరించారు..

ఇప్పుడొచ్చే చాలామంది నటులు తక్కువ శ్రమతో ఎక్కువ డబ్బులు సంపాదించడం ఎలా?, ఆటిట్యూట్ చూపించి, ఒక్క షాట్లో నటించి దేశానికి సేవ చేసినట్టు పబ్లిసిటీ చేయించుకోవడం ఎలా? … లాంటి కార్యక్రమంలో బిజీగా ఉంటున్నారు.. కొందరు రచయితలకి డైలాగ్స్, డైరెక్టర్ కి డైరెక్షన్ నేర్పిస్తుంటారు.. ఖర్మ అంతే.. ఇలాంటి వాళ్ళకి, ఇంకా చాలామందికి………..

చిరంజీవి ఒక చదవాల్సిన పుస్తకం..
చిరంజీవి ఒక బ్రతుకంత వాస్తవం..

‘అవకాశాల కోసం ఓపికగా, పట్టుదలతో ప్రయత్నిస్తే, విజయాలు మనవెంట పడతాయి’ అని నిరూపించిన జీవిత సత్యం పేరు చిరంజీవి..

ఇదంతా ఎందుకు!..
ఇప్పుడు ఎవరు నటుడు అవ్వాలని సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినా ఒక్కటే డైలాగు వినిపిస్తుంది..

“ఒర్నీ.. ప్రతీ ఒక్కడూ చిరంజీవి అయిపోదామనే వచ్చేస్తాడు ఇండస్ట్రీకి”……..
ఈ ఒక్కమాట చాలదా ‘చిరంజీవి’ ఏం సాధించారో చెప్పడానికి….

పుట్టినరోజు శుభాకాంక్షలు చిరంజీవి సర్.. 🙏💖🙏

….ప్రేమతో
…..లక్ష్మీ భూపాల ✍️